అల్కా లాంబపై తప్పుడు కేసులు ఎత్తివేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్
కేంద్ర బీజేపీకి రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అల్టిమేటం
బేషరతుగా విడుదల చేయకపోతే దేశవ్యాప్త ఉద్యమం: జ్యోతి భీమ్ భరత్ హెచ్చరికజాతీయ కాంగ్రెస్ మహిళా నాయకురాలు అల్కా లాంబపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం బనాయించిన తప్పుడు కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్ డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీలోని జాతీయ కాంగ్రెస్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడిన జ్యోతి భీమ్ భరత్, పార్లమెంట్ సమావేశాల సమయంలో జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ కోసం శాంతియుతంగా ఉద్యమం చేసిన అల్కా లాంబను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ అంశంలో బీజేపీ ప్రభుత్వ ద్వంద వైఖరిని దేశ రాజధానిలో అల్కా లాంబ ఎండగట్టారు, అందుకే కక్షపూరితంగా ఆమెపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. తప్పుడు కేసులను వెంటనే వెనక్కి తీసుకొని అల్కా లాంబను బేషరతుగా విడుదల చేయకపోతే తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా మహిళా సాధికారత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జాతీయ మహిళా కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబకు మద్దతుగా తెలంగాణ నుంచి అనేక మంది మహిళా ప్రతినిధులు ఢిల్లీలోని జాతీయ కాంగ్రెస్ కార్యాలయం వద్దకు చేరి సంఘీభావం తెలిపారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిని మానుకొని మహిళా నేతలను వేధించడం ఆపాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్ పేర్కొన్నారు.